chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 9:08 am Digital Edition : CHITTOORE EXPRESS

ఫైనాన్స్ సంస్థల ఆగడాలపై చర్యలు తీసుకోవాలి ప్రజలను దోచుకుంటున్న మైక్రో ఫైనాన్స్ కంపెనీలపై కఠిన చర్యలు అవసరం :  ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దెల అమృత్ తేజ

పీలేరు,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,జూన్ 21:

 

జిల్లాలో మైక్రో ఫైనాన్స్ సంస్థలు, ఇతర ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల ఆగడాలను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దెల అమృత్ తేజ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పేద, మధ్యతరగతి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సులభ రుణాల పేరుతో ప్రజలను ఆకర్షించి, అనంతరం అధిక వడ్డీలు, అదనపు ఛార్జీలు, జరిమానాలు విధిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా మహిళలు, రైతులు, చిన్న వ్యాపారులు రుణాల భారం వల్ల ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నారని తెలిపారు. వాయిదాల చెల్లింపులో స్వల్ప ఆలస్యం జరిగినా ఫీల్డ్ సిబ్బంది నేరుగా ఇళ్లకు వెళ్లి అవమానకరంగా ప్రవర్తించడం, బెదిరింపులకు పాల్పడటం, మానసిక ఒత్తిడికి గురిచేయడం వంటి ఘటనలు పెరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వం,సంబంధిత నియంత్రణ సంస్థలు ప్రత్యేక తనిఖీలు చేపట్టి చట్టవిరుద్ధ వసూళ్లు, అధిక వడ్డీ రేట్లు, ప్రజలపై వేధింపులకు పాల్పడుతున్న ఫైనాన్స్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆర్థికపరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రుణాల మంజూరు, వసూళ్ల ప్రక్రియలో పారదర్శకత తీసుకురావాలని, బాధితులకు రక్షణ కల్పించేలా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. మైక్రో ఫైనాన్స్ సంస్థల పేరుతో జరుగుతున్న దోపిడీని ప్రభుత్వం అరికట్టకపోతే ప్రజల తరఫున ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని మద్దెల అమృత్ తేజ హెచ్చరించారు.