
చిత్తూరు, చిత్తూరు ఎక్స్‌ప్రెస్, జూలై 17:
జిల్లాలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్, జిల్లా స్థాయి కమిటీ చైర్మన్ ఆదర్శ్ రాజేంద్రన్, ఐఏఎస్ అధికారులకు సూచించారు. శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే పలు నిబంధనలు, మార్గదర్శకాలు జారీ చేసిందని, వాటి సమర్థవంతమైన అమలుపైనే ప్రధాన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి క్షేత్రస్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు ఇంటింటి నుంచి సేకరించే వ్యర్థాలను తడి, పొడి, ప్లాస్టిక్ వ్యర్థాలుగా తప్పనిసరిగా వేరు చేసి శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని ఆదేశించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, వర్గీకరించిన అనంతరం వాటి సక్రమ పారవేతకు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా ప్లాస్టిక్ వినియోగం కొనసాగుతున్నట్లు సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై స్థానిక సంస్థలు జరిమానాలు విధించడంతో పాటు ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమల ప్రతినిధులు బయోడిగ్రేడబుల్ ఉత్పత్తులు, పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలని, ఎక్స్‌టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ (ఈపీఆర్) విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్ కార్యక్రమాల్లో స్థానిక సంస్థలకు పూర్తి సహకారం అందించాలని సమావేశంలో సూచించారు. ఈ సమావేశంలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నరసింహ ప్రసాద్, గ్రామీణ స్థానిక సంస్థల ప్రతినిధులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు, లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు, కార్మిక శాఖ అధికారులు, పర్యావరణ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.