chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 8:35 am Digital Edition : CHITTOORE EXPRESS

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి

శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ప్రెస్
శ్రీకాళహస్తి స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మూడో శనివారం శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుధ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కె.వి. కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. కూరగాయల మార్కెట్ వద్ద పరిశుభ్రత ప్రతిజ్ఞ చేయించిన అనంతరం పెండ్లిమండపం నుంచి బేరివారి మండపం, తేరు వీధి, సూపర్ బజార్ ప్రాంతాల మీదుగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌కు బదులుగా వస్త్ర, పునర్వినియోగ సంచులను వినియోగించాలని కమిషనర్ సూచించారు. నిషేధిత ప్లాస్టిక్‌ను వినియోగించినా, విక్రయించినా రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, మేస్త్రీలు, పారిశుధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.