chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 9:07 pm Digital Edition : CHITTOORE EXPRESS

ప్రశ్న రావణ్ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు: రెడ్యం వెంకటసుబ్బారెడ్డి

ఖాజీపేట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూలై 10:

 

ప్రశ్న రావణ్ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, కమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఆరోపించారు. కడపలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హిందూ దేవుళ్లను లేదా సనాతన ధర్మాన్ని కించపరిచే వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ సమర్థించదని స్పష్టం చేశారు. అయితే ప్రశ్న రావణ్ అరెస్టు విధానాన్ని మాత్రమే తమ పార్టీ వ్యతిరేకించిందని తెలిపారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హిందూ దేవాలయాల అభివృద్ధికి, హైందవ ధర్మ పరిరక్షణకు కృషి చేశారని పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధి విస్తరణతో పాటు హిందూ దేవాలయాల పరిరక్షణకు గతంలో తీసుకొచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హిందూ ధర్మంపై చేస్తున్న వ్యాఖ్యలపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మతాలను వాడుకోవడం సరికాదని, హిందూ వ్యతిరేకులుగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ జగన్‌లను చిత్రీకరించే ప్రయత్నాలు మానుకోవాలని కోరారు. అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఖండించారు.