chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 10:59 pm Digital Edition : CHITTOORE EXPRESS

ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించాలి మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తప్పనిసరి: రాళ్లబుదుగూరు ఎస్సై నరేష్

శాంతిపురం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, సెప్టెంబర్ 12:

 

వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని రాళ్లబుదుగూరు ఎస్సై నరేష్ కోరారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఉత్సవ కమిటీ నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. వినాయక మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా పొందాలని తెలిపారు. ఉత్సవ కమిటీలు ముందుగా పోలీస్ పోర్టల్‌లో ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని, పోలీస్, విద్యుత్, అగ్నిమాపక శాఖల నుంచి అవసరమైన అనుమతులు తీసుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించకుండా మండపాలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండపాలను రోడ్ల మధ్యలో లేదా వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించే ప్రాంతాల్లో ఏర్పాటు చేయరాదని, పోలీసుల అనుమతితో నిర్ణీత ప్రదేశాల్లోనే ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. విద్యుత్ అలంకరణలకు నాణ్యమైన వైరింగ్‌నే ఉపయోగించాలని, అనధికారిక విద్యుత్ కనెక్షన్లకు దూరంగా ఉండాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో వాటర్‌ప్రూఫ్‌ పందిళ్లు ఏర్పాటు చేయడంతో పాటు, గాలికి తట్టుకునేలా మండపాలను పటిష్ఠంగా నిర్మించుకోవాలని కోరారు. మండపాల వద్ద భద్రత కోసం వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండపాలు, నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. లౌడ్‌స్పీకర్ల వినియోగంలో నిబంధనలు పాటిస్తూ రాత్రి 10 గంటల తర్వాత మైకులను నిలిపివేయాలని తెలిపారు. వినాయక విగ్రహాల నిమజ్జన ఊరేగింపును పోలీసుల సూచనల మేరకు నిర్ణీత మార్గాల్లోనే నిర్వహించాలని ఎస్సై నరేష్ సూచించారు. భారీ విగ్రహాల తరలింపు సమయంలో విద్యుత్ తీగల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి వినాయక చవితి వేడుకలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు.