
శ్రీకాళహస్తి,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్ 05
శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం చిట్టత్తూరు గ్రామం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని చిట్టత్తూరు గ్రామంలో గ్రామ అభివృద్ధి అధికారి శాంతి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శాంతి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించడం, ప్రకృతిని కాపాడడం, చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడం, భూమిని రక్షించడం ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం పర్యావరణం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని ఆమె వివరించారు. వాతావరణ మార్పులు, పారిశ్రామికీకరణ, ఇంధనాల అధిక వినియోగం, అటవీ నిర్మూలన వంటి కారణాలతో వాతావరణంలో హరితగృహ వాయువుల స్థాయి పెరుగుతోందని చెప్పారు. దీనివల్ల ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగి వరదలు, కరువులు, తుపానులు, అగ్నిప్రమాదాలు, తీవ్ర ఉష్ణోగ్రతలు వంటి ప్రకృతి వైపరీత్యాలు అధికమవుతున్నాయని తెలిపారు. అలాగే ప్లాస్టిక్ అధిక వినియోగం, సహజ వనరుల దుర్వినియోగం కూడా పర్యావరణానికి ముప్పుగా మారాయని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, చెట్లు నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, సహజ వనరులను సంరక్షించడం ద్వారా సుస్థిర భవిష్యత్తుకు తోడ్పడాలని గ్రామస్తులకు సూచించారు.ఈ కార్యక్రమంలో చిట్టత్తూరు సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.