తాడేపల్లి, చిత్తూరు ఎక్స్ ప్రెస్ఏ,ప్రిల్ 07:
తాడేపల్లి మండలం ప్రాతూరు గ్రామంలో కిశోర బాలికల కోసం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ స్వచ్ఛంద సంస్థ చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కమ్యూనిటీ ఆర్గనైజర్ అత్తోట పోతురాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారని తెలిపారు. ప్రపంచ ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్య అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ ఏడాది “ఆరోగ్యం కోసం కలిసికట్టుగా, విజ్ఞానానికి అండగా నిలబడదాం” అనే ఇతివృత్తంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం అనిల్ కుమార్ మాట్లాడుతూ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తీసుకోవడం అవసరమని వివరించారు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పాల పదార్థాలు ఆహారంలో భాగం కావాలని, కొవ్వు, చక్కెర అధికంగా ఉండే ఆహారాలను తగ్గించాలని సూచించారు. రోజుకు తగినంత నీరు తాగడం, వ్యాయామం చేయడం, సరిపడ నిద్రపోవడం అవసరమని తెలిపారు. నాగమణి మాట్లాడుతూ కిశోర బాలికల్లో రక్తహీనత సమస్య తీవ్రంగా ఉన్నదని తెలిపారు. పోషకాహార లోపం, ఐరన్ కొరత, రుతుస్రావం కారణంగా రక్తహీనత ఏర్పడుతుందని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. కాబట్టి బాలికలు పోషకాహారం తీసుకోవడం అత్యంత అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో బాలల పార్లమెంట్ సభ్యులు, సంస్థ సిబ్బంది మరియు గ్రామానికి చెందిన బాలికలు పాల్గొన్నారు.