chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 1:32 pm Digital Edition : CHITTOORE EXPRESS

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: క్షేత్రస్థాయిలో కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ పర్యటన

కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 25:

 

ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి వేగంగా పరిష్కరించడమే లక్ష్యంగా కడ (KADA) ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్, ఐఏఎస్ శనివారం కుప్పం ప్రాంతంలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్‌కు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొదటగా కుప్పం రూరల్ మండలం వెండుగంపల్లి గ్రామంలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను సందర్శించిన వికాస్ మర్మత్, హబ్‌లో అమలవుతున్న కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇటీవల నియమితులైన నలుగురు వాలంటీర్లతో సమావేశమై హబ్ లక్ష్యాలు, యువ పారిశ్రామికవేత్తలకు అందించాల్సిన మార్గదర్శకత్వంపై సూచనలు చేశారు. వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చే యువతకు మెంటారింగ్, శిక్షణ, సాంకేతిక సహకారం అందించి విజయవంతమైన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఎన్‌టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు. కాంప్లెక్స్‌కు వెళ్లే రహదారిలో ఉన్న సమస్యను వెంటనే పరిష్కరించి రవాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి కుప్పం ఏరియా ఆసుపత్రిని సందర్శించి ‘వన్ స్టాప్ సొల్యూషన్’ కేంద్రం కోసం కొత్త భవనం నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించారు. భవన నిర్మాణానికి అవసరమైన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆ తర్వాత కుప్పం పట్టణంలోని రామచంద్ర రోడ్డులో పీజీఆర్‌ఎస్ ద్వారా అందిన డ్రైనేజీ సమస్యను స్థానికులతో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ అత్యవసరంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.అనంతరం కొత్తపేట ప్రాంతంలో పీజీఆర్‌ఎస్‌లో నమోదైన రోడ్డు సమస్యను పరిశీలించిన వికాస్ మర్మత్, వారం రోజుల్లోగా పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరిస్తూ, నిర్దేశించిన గడువులో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వికాస్ మర్మత్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా కేంద్రిత పాలనకు అనుగుణంగా ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పరిష్కరించడమే కడ లక్ష్యమని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన ప్రభుత్వ సేవలు అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.