
చిత్తూరు,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,మే 25:
ప్రజల సమస్యలను చట్టబద్ధంగా, త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన “పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్” కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి నిర్దేశిత గడువులోగా పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్పీ తుషార్ డూడి, అదనపు ఎస్పీ రాజశేఖర్ రాజు, చిత్తూరు వెస్ట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ నాయుడును కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యలపై న్యాయం పొందేలా పోలీసులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని ఎస్పీ మరోసారి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 48 ఫిర్యాదులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. అందులో సైబర్ క్రైమ్‌కు సంబంధించిన ఒక ఫిర్యాదు, కుటుంబ తగాదాలకు 10, వేధింపులకు 5,ఇంటి తగాదాలకు ఒకటి,భర్త వేధింపులకు ఒకటి,భూ తగాదాలకు 10,డబ్బు తగాదాలకు 8, చిన్న గొడవలకు 5, పోలీసు సేవలకు 3, ఆస్తి తగాదాలకు 3, దారి సమస్యకు ఒక ఫిర్యాదు వచ్చినట్లు వెల్లడించారు.