chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 4:30 am Digital Edition : CHITTOORE EXPRESS

పెండింగ్ వినతులను వెంటనే పరిష్కరించాలి అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

చిత్తూరు, చిత్తూరు ఎక్స్ ప్రెస్ ,జూలై 27:

 

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు జాప్యం చేయరాదని, పెండింగ్‌లో ఉన్న వినతులను నిర్ణీత గడువులోగా పరిష్కరించి వెంటనే డిస్పోజ్ చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)/రెవెన్యూ క్లినిక్‌లో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డీఆర్‌వో కె. మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్‌తో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పీజీఆర్‌ఎస్/రెవెన్యూ క్లినిక్‌లో మొత్తం 242 వినతులు నమోదయ్యాయని, వాటిలో అత్యధికంగా 181 వినతులు రెవెన్యూ, సర్వే శాఖకు సంబంధించినవేనని తెలిపారు. ప్రతి వినతిని ప్రత్యేకంగా సమీక్షించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రైతుల రీ-సర్వే, భూ వివాదాలు, రికార్డులలోని తప్పులు, సరిహద్దు వివాదాలు, విస్తీర్ణ వ్యత్యాసాలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రాధాన్యతతో పరిష్కరించాలని సూచించారు. భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరిస్తూ, రైతులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా స్థానిక తహసీల్దార్ కార్యాలయాల్లోనే పారదర్శకంగా సేవలు అందించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ 1100 టోల్ ఫ్రీ సేవ ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా పరిష్కరించాలని, అర్జీదారులతో నేరుగా మాట్లాడిన అనంతరం మాత్రమే నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. అర్జీదారులతో మాట్లాడిన తేదీ,సమయాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలని, ప్రజల్లో 1100 సేవలపై మరింత అవగాహన కల్పించాలని సూచించారు. శాఖలవారీగా నమోదైన వినతులు: రెవెన్యూ & సర్వే – 181,డీఆర్‌డీఏ – 22, పంచాయతీరాజ్ – 6,మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ – 6,పోలీస్ – 5, విద్యాశాఖ – 4, సివిల్ సప్లైస్ – 3,ఎండోమెంట్స్ – 2, ఏపీఎస్పీడీసీఎల్ – 2, వ్యవసాయ శాఖ – 2,బీసీ కార్పొరేషన్ – 2,రవాణా శాఖ – 2, గృహ నిర్మాణ శాఖ – 2, కమర్షియల్ ట్యాక్స్ – 1, ఇరిగేషన్ శాఖ – 1, గ్రామీణాభివృద్ధి శాఖ – 1. ఈ కార్యక్రమంలో ఆర్‌డీఓ శ్రీనివాసులు నాయుడు, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ పుల్లారెడ్డి, విజయలక్ష్మి తదితర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.