
రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 06:
రాబోయే పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో చర్యలు చేపడుతున్నారు. మంగళవారం రేణిగుంట ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంపీడీవో రవిచంద్ర, తహశీల్దార్ శ్రావణ్ కుమార్, రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర, రూరల్ సీఐ మంజునాథరెడ్డితో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక నిఘా, అదనపు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల్లో అలజడులకు అవకాశం ఉన్న వ్యక్తులపై నిఘా ఉంచడంతో పాటు అవసరమైన ముందస్తు బైండోవర్ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే నగదు, మద్యం అక్రమ రవాణాపై నిఘా కోసం చెక్పోస్టులు, మొబైల్ పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని పోలీసులు కోరారు.