chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 20 October 2026, 6:15 pm Digital Edition : CHITTOORE EXPRESS

నామినేషన్ల వేళ పోలీసుల నిఘా.. కుప్పంలో ఆంక్షలు కఠినం! కాన్వాయ్‌లు, ర్యాలీలకు అనుమతి లేదు.. 200 మీటర్ల పరిధిలో గుంపులుగా చేరితే చర్యలు నిబంధనలు ఉల్లంఘిస్తే అభ్యర్థిత్వంపై ప్రభావం

కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్,అక్టోబర్ 20:

 

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో కుప్పం సబ్‌డివిజన్‌లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. నామినేషన్‌ కేంద్రాల వద్ద రాజకీయ సందడి పేరుతో గుంపులు గుమికూడినా, అనుచరులతో వాహనాల కాన్వాయ్‌లు, ర్యాలీలతో హడావుడి చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు కుప్పం అర్బన్‌, రామకుప్పం, రాళ్లబూదుగూరు, గుడుపల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలోని సంబంధిత ఎంపీడీవో కార్యాలయాలు, నామినేషన్‌ కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 163 కింద ఆంక్షలు అమలు చేస్తున్నట్లు కుప్పం సబ్‌డివిజన్‌ ఏఎస్పీ బి. హేమంత్‌ ఐపీఎస్‌ స్పష్టం చేశారు.

 

అభ్యర్థితో ఇద్దరికే అనుమతి

 

నామినేషన్‌ దాఖలు చేసే అభ్యర్థితో పాటు మరో ఇద్దరు వ్యక్తులకు మాత్రమే కేంద్రంలోకి అనుమతి ఉంటుందని పోలీసులు తెలిపారు. నామినేషన్‌ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో నలుగురికి మించి గుమికూడరాదని స్పష్టం చేశారు. నిబంధనలను పక్కనపెట్టి అధిక సంఖ్యలో అనుచరులను వెంట తీసుకొచ్చినా, వాహనాల కాన్వాయ్‌లు, ర్యాలీలతో హడావుడి చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

 

డ్రోన్లతో నిఘా.. ఉల్లంఘనలపై కన్ను

 

నామినేషన్‌ కేంద్రాల పరిసరాలతో పాటు కుప్పం పట్టణంలోనూ పోలీసులు నిఘా కొనసాగించనున్నారు. అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాలతో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించనున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినా, పోలీసుల ఆదేశాలను ధిక్కరించినా సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ హెచ్చరించారు.

 

రిటర్నింగ్‌ అధికారికి నివేదిక

 

ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన వివరాలను రిటర్నింగ్‌ అధికారికి నివేదిస్తామని పోలీసులు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థిత్వంపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పోలీసులకు సహకరించాలని ఏఎస్పీ బి. హేమంత్‌ కోరారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.