
గంగవరం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, ఆగస్టు 29:
హాకీ దిగ్గజం, భారత క్రీడా రంగానికి విశేష సేవలందించిన మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను గంగవరం మండలంలోని ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులతో పాఠశాల పరిసర ప్రాంతాల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు క్రీడల ప్రాధాన్యతను తెలియజేస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. హాకీ క్రీడలో భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన మహోన్నత క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ అని కొనియాడారు. ఆయన క్రీడా ప్రతిభ, క్రమశిక్షణ, అంకితభావం నేటి విద్యార్థులకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపైనా ఆసక్తి పెంచుకుని శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.