
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 22:
నాలుగు ద్విచక్ర వాహనాలపై కారు దూసుకెళ్లిన ఘటన బుధవారం నాడు కుప్పం మండలం మల్లానూరు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు మల్లా నూరు నుండి కుప్పం వైపు వస్తున్న కారు ఎదురుగా వస్తున్న నాలుగు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మొత్తం ఐదు మంది తీవ్ర గాయాలు పాలు కాగా ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం పి ఈ ఎస్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. క్షతగాత్రులలో ముగ్గురు కుప్పం మండలానికి చెందినవారు కాగా మరో ఇద్దరు కర్ణాటక రాష్ట్రం కే జి ఎఫ్ ప్రాంతానికి చెందినవారుగా స్థానికులు తెలిపారు. ప్రమాదానికి గురి అయిన క్షతగాత్రులలో సింగారపురం గ్రామానికి చెందిన సి.కేశవన్, కుప్పం పట్టణం సామగుట్టపల్లి, హనుమంతు కోటాలు ప్రాంతానికి చెందిన వెంకటేష్, శీగలపల్లి ప్రాంతానికి చెందిన తిమ్మాజీ లు కుప్పం ప్రాంతానికి చెందినవారు కాగా, కర్ణాటక రాష్ట్రం కేజీఎఫ్ మారి కుప్పం ప్రాంతానికి చెందిన విజయ్ బాబు, స్వామినాథపురం ప్రాంతానికి చెందిన ప్రభు లు ఉన్నట్టు తెలుస్తోంది. గాయాలు పాలైన క్షతగాత్రులకు పి ఈ ఎస్ వైద్య కళాశాల నందు చికిత్స జరుగుతుండగా, వారికి ఎలాంటి ప్రాణభయం లేదని వైద్యులు ద్వారా తెలిసింది. అయితే ప్రమాదంలో తీవ్రంగా గాయపడడం చేత మరో 24 గంటలు క్షతగాత్రులను వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి కారణమైన కారును కుప్పం పట్టణ సహకార బ్యాంకు మేనేజరుగా వ్యవహరిస్తున్న శివకృష్ణ నడిపినట్టు స్థానికులు తెలిపారు. కారు అతివేగం కారణంగానే నాలుగు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లినట్టు స్థానికులు ద్వారా తెలిసింది. అయితే ప్రమాదానికి గల కారణాలు, నిజా నిజాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.