
గుడిపల్లి,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,ఆగస్టు 15:
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలపరిధిలోని ద్రావిడ విశ్వవిద్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపకులపతి ఆచార్య ఎల్.సి. మల్లయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, భద్రతా దళాలు, ఎన్‌సీసీ విద్యార్థుల కవాతు ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ “వికసిత్ భారత్@2047 కోసం యువశక్తి, వారసత్వం మరియు అభివృద్ధి” ఇతివృత్తంతో వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర–2047 లక్ష్యానికి అనుగుణంగా విశ్వవిద్యాలయం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కుప్పం ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలోని కళాశాలలను త్వరలో ద్రావిడ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపునకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి. కిరణ్ కుమార్, ఫైనాన్స్ ఆఫీసర్ డాక్టర్ వి.పలని,డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.