chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 5:55 am Digital Edition : CHITTOORE EXPRESS

చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ చొరవతో మామిడి రైతులకు ఊరట ఐసీఏఆర్ నిపుణుల కమిటీతో సమస్యలపై కేంద్రం అధ్యయనం మ్యాంగో బోర్డు ఏర్పాటే శాశ్వత పరిష్కారమని ఎంపీ సూచన

చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్ ,జూలై 10:

 

చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు దగ్గుమళ్ళ ప్రసాదరావు చొరవతో ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. గత ఐదేళ్లుగా ధరల పతనం, పెరిగిన సాగు వ్యయం, ప్రకృతి వైపరీత్యాలు, ఎగుమతుల మందగమనం, ప్రాసెసింగ్ పరిశ్రమల కొనుగోళ్లలో తగ్గుదల వంటి కారణాలతో తీవ్ర సంక్షోభంలో ఉన్న మామిడి రైతులకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) నిపుణుల కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాల మేరకు లక్నోలోని ఐసీఏఆర్–సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సబ్ ట్రాపికల్ హార్టికల్చర్ శాస్త్రవేత్త డాక్టర్ టి. దామోదరన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ రెండు రోజుల పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించింది. తోతాపురి మామిడి సాగు ప్రాంతాలను సందర్శించి రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీఓలు), ప్రాసెసింగ్ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకుంది. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు కమిటీ సభ్యులతో మాట్లాడి జిల్లాలోని మామిడి రైతుల పరిస్థితిని వివరించారు. దేశంలోనే తోతాపురి మామిడి సాగుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కేంద్రంగా నిలిచిందని, జిల్లాలో సుమారు 2.80 లక్షల ఎకరాల్లో మామిడి సాగు జరుగుతుండగా, అందులో 90 శాతం తోతాపురి రకమేనని తెలిపారు. ప్రతి ఏడాది సుమారు 7.50 లక్షల టన్నుల దిగుబడి లభిస్తోందని, రాష్ట్రంలోని మామిడి గుజ్జు పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకులో అత్యధిక భాగం చిత్తూరు జిల్లా నుంచే సరఫరా అవుతోందని వివరించారు. ఒకప్పుడు టన్నుకు రూ.18 వేల నుంచి రూ.30 వేల వరకు పలికిన తోతాపురి ధర ఈ సీజన్‌లో కొన్ని ప్రాంతాల్లో రూ.4 వేలకే పరిమితమైందని, దీంతో కోత ఖర్చులు కూడా రాక రైతులు పండ్లను చెట్లపైనే వదిలేయడం, రోడ్ల పక్కన పారబోయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. పలమనేరు, బైరెడ్డిపల్లి, బంగారుపాళ్యం, పూతలపట్టు, కుప్పం ప్రాంతాల్లో ఈ పరిస్థితిని తాను స్వయంగా పరిశీలించినట్లు కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. మామిడి రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రత్యేక మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలని ఐసీఏఆర్ నిపుణుల కమిటీకి ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. రైతుల ఆదాయం పెంపు, తోతాపురి ధరల స్థిరీకరణ, సాగు నుంచి ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతుల వరకు సమగ్ర విధానాన్ని రూపొందించేలా కమిటీ సూచనలు ఇవ్వాలని కోరారు. మామిడి రైతుల సమస్యలపై శాస్త్రీయ అధ్యయనం కోసం ఐసీఏఆర్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర వ్యవసాయ శాఖకు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు కృతజ్ఞతలు తెలిపారు.