chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 9:36 pm Digital Edition : CHITTOORE EXPRESS

దాల్మియా భారత్ విస్తరణతో కడప పారిశ్రామిక రంగానికి కొత్త ఊపు రూ.3,100 కోట్ల పెట్టుబడితో రెండో యూనిట్ విస్తరణకు శంకుస్థాపన వేలాది మందికి ఉపాధి అవకాశాలు: మంత్రులు టి.జి. భరత్, సవిత, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి

కడప,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 15:

 

వైఎస్సార్ కడప జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం మండలం చిన్నకొమర్లలో దాల్మియా భారత్ సిమెంట్ రెండో ఉత్పత్తి విభాగం విస్తరణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టి.జి. భరత్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత, ప్రభుత్వ విప్, జమ్మలమడుగు ఎమ్మెల్యే సీఎం ఆదినారాయణ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, పరిశ్రమలకు అనుకూల విధానాలు, మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను వేగంగా మంజూరు చేయడంతో పాటు ప్రతి ప్రాజెక్టును ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు. కడప జిల్లాలోని సున్నపురాయి నిల్వలను సద్వినియోగం చేసుకుంటూ దాల్మియా భారత్ రూ.3,100 కోట్లతో విస్తరణ చేపట్టడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించడంతో పాటు అనుబంధ పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందనున్నాయని చెప్పారు. పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్ మాట్లాడుతూ దాల్మియా భారత్ దేశంలోని ప్రముఖ సిమెంట్ సంస్థల్లో ఒకటిగా నిలిచిందని తెలిపారు. ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో 19 తయారీ కేంద్రాలతో దేశంలో నాలుగో అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థగా కొనసాగుతోందన్నారు. విస్తరణ పూర్తయిన అనంతరం కడపలోనే సంస్థకు దేశంలో అతిపెద్ద సమీకృత సిమెంట్ ఉత్పత్తికేంద్రం ఏర్పడుతుందని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ తక్కువ కార్బన్ ఉద్గారాలతో ఉత్పత్తి, పునరుత్పాదక ఇంధన వినియోగం, సుస్థిర పారిశ్రామికాభివృద్ధి లక్ష్యాలతో సంస్థ ముందుకు సాగుతోందని కొనియాడారు. అలాగే దాల్మియా భారత్ ఫౌండేషన్ ద్వారా యువతకు నైపుణ్యా భివృద్ధి శిక్షణ, మహిళల సాధికారత, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సీఎం ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ జమ్మలమడుగు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా దాల్మియా విస్తరణ ప్రాజెక్టు కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. స్థానిక యువతకు ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.