chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 6:15 am Digital Edition : CHITTOORE EXPRESS

*తోతాపురి మామిడి రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం*  *తోతాపూరి రైతులకు సబ్సిడీ అందించడంలో అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది*   *మామిడి రంగ అభివృద్ధిపై కేంద్ర బృందం చిత్తూరు జిల్లాలో పర్యటన:* *జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్*

చిత్తూరు, చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 10:

 

తోతాపూరి మామిడి పంట నష్టపోయిన అర్హులైన ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మార్గదర్శకాల మేరకు సబ్సిడీ అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ పత్రికా సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తోతాపూరి మామిడి పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావు ఉండదని, గ్రామసభలు, క్షేత్రస్థాయి పరిశీలన, గత ఏడాది వివరాలు, రైతుల ధృవీకరణ, పంట ఈ కేవైసీ నమోదు వంటి అంశాల ఆధారంగా అర్హులను గుర్తిస్తామని చెప్పారు. మామిడి పంట నష్టపోయిన రైతులందరికీ న్యాయం జరిగేలా పారదర్శకంగా ప్రక్రియ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.సబ్సిడీ పంపిణీ రాష్ట్ర ప్రభుత్వ విధానాల ప్రకారం జరుగుతుందని, అర్హులైన రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్రామస్థాయిలో అధికారులు సమగ్రంగా వివరాలు సేకరించి, అర్హుల జాబితాను సిద్ధం చేస్తారని తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితులు, ఎగుమతుల మందగమనం, పల్ప్ పరిశ్రమల్లో కొనుగోళ్లు తగ్గిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్ళిచర్చించడం జరిగిందన్నారు. వారి ఆదేశాల మేరకుతోతాపురి మామిడి పండ్లకు కిలోకు రూ.4 కనీస మద్దతు ధర ప్రకటించినట్లు వెల్లడించారు. జిల్లాలో సుమారు 51,736 హెక్టార్లలో తోతాపురి మామిడి సాగు జరుగుతోందని, హెక్టారుకు సగటున 10 మెట్రిక్ టన్నుల దిగుబడి ఆధారంగా సుమారు 5.174 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉన్నట్లు తెలిపారు. దక్షిణ భారతదేశంలో మామిడి గుజ్జు తయారీ, ఎగుమతులకు చిత్తూరు జిల్లా ప్రధాన కేంద్రంగా ఉండటంతో సుమారు 35 వేల రైతు కుటుంబాలు ఈ పంటపైనే ఆధారపడి జీవిస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో సాగయ్యే తోతాపురి రకం ప్రధానంగా గుజ్జు తయారీకి మాత్రమే అనువైనదని, తాజా పండ్ల మార్కెట్లో ఈ రకానికి పెద్దగా డిమాండ్ ఉండదని వివరించారు. గత ఏడాదితో పాటు ప్రస్తుత సీజన్లో కూడా పల్ప్ పరిశ్రమలు కొనుగోళ్లు తగ్గించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. అలాగే, తోతాపూరి మామిడి సాగుకు సంబంధించిన సమస్యలను అధ్యయనం చేసి తగిన పరిష్కారాలను సూచించేందుకు కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ మంత్రి ఆదేశాల మేరకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) నియమించిన నిపుణుల బృందం ఈ రోజు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఐసీఏఆర్ –సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సబ్‌ట్రాపికల్ హార్టికల్చర్ (ICAR-CISH), లక్నో డైరెక్టర్ డాక్టర్ టి. దామోదరన్ నేతృత్వంలోని ఈ నిపుణుల బృందంలో డాక్టర్ ఎం. శంకరన్, హెడ్, ఫ్రూట్ క్రాప్స్, ICAR-IIHR, బెంగళూరు; డాక్టర్ హెచ్.ఎస్. సింగ్, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ICAR-CISH, లక్నో; డాక్టర్ డి. శ్రీనివాస రెడ్డి, ప్రొఫెసర్, కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, అనంతరాజుపేట, డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం; అలాగే ఆంధ్రప్రదేశ్ ఉద్యానశాఖ డైరెక్టర్ లేదా వారి ప్రతినిధి సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం రైతులు, జిల్లా యంత్రాంగం, మామిడి పల్ప్ పరిశ్రమల ప్రతినిధులు, ఎగుమతిదారులతో సమావేశమై ప్రస్తుత పరిస్థితులను అధ్యయనం చేస్తోందన్నారు. మామిడి ఉత్పత్తులకు డిమాండ్ పెంపు, నాణ్యత మెరుగుదల, ఎగుమతుల విస్తరణ, మార్కెటింగ్ విధానాలు, ప్రాసెసింగ్ పరిశ్రమల పనితీరు వంటి అంశాలపై కేంద్ర బృందం సమగ్రంగా అధ్యయనం చేసి తమ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా అధ్యయనం నిర్వహిస్తున్న కేంద్ర బృందం, రైతులకు దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూరే విధానాల రూపకల్పనకు అవసరమైన సూచనలు చేయనున్నట్లు వెల్లడించారు.