chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 8:07 am Digital Edition : CHITTOORE EXPRESS

తుమ్మిసిలో పల్లెనిద్ర కార్యక్రమం బాల్య వివాహాలు, వ్యసనాలపై ప్రజలకు అవగాహన

శాంతిపురం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, జూన్05:

 

చిత్తూరు జిల్లాశాంతిపురం మండలంలోని తుమ్మిసి గ్రామంలో నిర్వహించిన పల్లెనిద్ర కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాళ్లబుదుగూరు ఎస్సై ఐ. నరేష్ ముఖ్య అతిథిగా హాజరై గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై నరేష్ మాట్లాడుతూ బాల్య వివాహాలు, దొంగతనాలు, ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు, యువతలో పెరుగుతున్న మత్తు వ్యసనాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. చిన్న వయస్సులో వివాహాలు జరపడం వల్ల బాలబాలికల భవిష్యత్తు దెబ్బతింటుందని, అలాంటి ఘటనలు ఎక్కడైనా తెలిసినా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రయాణించాలని సూచించారు. అలాగే కుటుంబ సభ్యులు పిల్లల ప్రవర్తన, స్నేహితుల వర్గం, చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తల్లిదండ్రులకు సూచనలు చేశారు. ప్రజలు, పోలీసుల మధ్య సత్సంబంధాలు నెలకొంటే గ్రామాల్లో శాంతిభద్రతలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. గ్రామాల్లో జరిగే అనుమానాస్పద సంఘటనలు, నేర కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి.కే. మంజునాథ్, శేఖర్, నవీన్ కుమార్, నాగరాజు, బాలసుబ్రమణ్యం, నెంగళి చలపతి, ఈ. చలపతి పాల్గొన్నారు. గ్రామ నాయకులు, మహిళలు, యువకులు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పల్లెనిద్ర కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం పెంపొందిందని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.