chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 30 August 2026, 8:24 am Digital Edition : CHITTOORE EXPRESS

తల్లిదండ్రుల మందలింపుతో ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడు..  పోలీసుల చొరవతో క్షేమంగా ఇంటికి

రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు 29:

 

చదువులో సరిగ్గా రాణించడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన 10 ఏళ్ల బాలుడు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు. అయితే ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని ఓ ఆటోడ్రైవర్ గుర్తించి పోలీసులకు అప్పగించడంతో బాలుడు క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేరాడు. తిరుపతికి చెందిన ధనుష్ (10) జీవకోనలోని శ్రీ సదీశ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. చదువులో సరిగ్గా శ్రద్ధ చూపడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో కోపానికి గురైన బాలుడు శనివారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వచ్చాడు. ఈ క్రమంలో మంగళం రోడ్డులో బాలుడు ఒంటరిగా తిరుగుతుండటాన్ని తారకరామ నగర్‌కు చెందిన రామచంద్ర అనే ఆటోడ్రైవర్ గమనించాడు. బాలుడి పరిస్థితిని గమనించిన రామచంద్ర వెంటనే అతడిని రేణిగుంట పోలీసుల వద్దకు తీసుకెళ్లి అప్పగించాడు. బాలుడి నుంచి వివరాలు తెలుసుకున్న రేణిగుంట పోలీసులు అతని తల్లిదండ్రులు ఎనుగుల శ్రీనివాసులు, రెడ్డెమ్మలకు, అలాగే పాఠశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. అనంతరం బాలుడిని సురక్షితంగా అతని తల్లిదండ్రులకు అప్పగించారు. తమ కుమారుడు క్షేమంగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. బాలుడిని గుర్తించి పోలీసులకు అప్పగించిన ఆటోడ్రైవర్ రామచంద్రకు, బాలుడిని సురక్షితంగా తమకు అప్పగించిన రేణిగుంట పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. బాలుడి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించి పోలీసులకు సమాచారం అందించిన ఆటోడ్రైవర్ రామచంద్రను స్థానికులు అభినందించారు.