chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 7:41 am Digital Edition : CHITTOORE EXPRESS

డ్రోన్ సాంకేతికతతో పంటలకు మందుల పిచికారీ..  రైతులకు ఆధునిక సాగుపై అవగాహన

గుడిపల్లి,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు 06:

 

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం చీకటిపల్లి పంచాయతీ పరిధిలో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించే ఉద్దేశంతో గురువారం డ్రోన్ సాయంతో పంటలకు మందుల పిచికారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే విధానాలను రైతులకు ప్రత్యక్షంగా వివరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ డ్రోన్ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో సమర్థవంతంగా మందుల పిచికారీ చేయవచ్చని, దీంతో రైతుల శ్రమ, ఖర్చు తగ్గడంతో పాటు పంటల దిగుబడి పెరిగే అవకాశాలు ఉంటాయని తెలిపారు. అలాగే రసాయన మందుల ప్రత్యక్ష ప్రభావం నుంచి రైతులకు రక్షణ కలుగుతుందని వివరించారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎస్. సుబ్రమణి మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగం కాలానుగుణ అవసరమని, డ్రోన్ సాంకేతికత రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందని పేర్కొన్నారు. ఆధునిక పద్ధతులను రైతులు విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జి, మాజీ జెడ్పీటీసీ బేటప్ప నాయుడు, మాజీ క్లస్టర్ ఇన్‌చార్జి హేమంబర్ గౌడు, మండల ప్రధాన కార్యదర్శి సురేష్ అగరం, మాజీ సర్పంచ్ గోపాల్, మాజీ ఆత్మ చైర్మన్ చంద్ర, యూనిట్ ఇన్‌చార్జి అమరేష్, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రకృతి సేద్య అధికారులు, రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.