chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 6:40 am Digital Edition : CHITTOORE EXPRESS

డ్రైనేజీలు పూడిపోయి దుర్వాసన..  పట్టించుకోవడం లేదని గ్రామస్తుల ఆవేదన

 

పలమనేరు రూరల్, చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్03:

 

 

చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం పెంగరగుంట గ్రామ పంచాయతీ పరిధి లో పారిశుద్ధ్య సమస్యలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ పరిధిలోని పెంగరగుంట, జంగాలపల్లి, కోతిగుట్ట, తావడపల్లి, ముసలిమడుగు తదితర గ్రామాల్లో డ్రైనేజీలు ఏళ్ల తరబడి శుభ్రం చేయక పోవడంతో మురుగునీరు నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్రైనేజీలు పూర్తిగా చెత్తాచెదారంతో నిండిపోవడంతో ప్రజలు వీధుల్లో తిరగలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. మురుగునీరు నిల్వ ఉండటం వల్ల దోమలు విపరీతంగా పెరిగి మలేరియా, డెంగ్యూ వంటి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వారం గ్రామాల్లో పర్యటిస్తున్న ఆరోగ్య మిత్ర బృందం కూడా పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించి సంబంధిత అధికారులకు పలుమార్లు తెలియజేసి నప్పటికీ సమస్య పరిష్కారానికి చర్యలు కనిపించడం లేదని గ్రామస్థులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా పలు గ్రామాల్లో తాగునీటి పైపులు, కుళాయిలు దెబ్బతిని నీరు వృథాగా పోతుండగా, అనేక ప్రాంతాల్లో వీధి దీపాలు పనిచేయడం లేదని తెలిపారు. ఈ సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆరోపిస్తున్నారు. ఇంటి పన్నుల వసూళ్ల కోసం అధికారులు తరచూ గ్రామాలకు వస్తున్నప్పటికీ, పారిశుద్ధ్యం, డ్రైనేజీల శుభ్రత, తాగునీటి సమస్యలు, వీధి దీపాల మరమ్మతులపై తగిన శ్రద్ధ చూపడం లేదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.