
రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 15 :
తిరుపతి జిల్లాను గంజాయి,డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంతో జిల్లా పోలీసుశాఖ విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు రేణిగుంట పరిధిలోని తారకరామనగర్‌లో పోలీసు అధికారులు ప్రజలకు, యువతకు మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.”డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో యువతలో చైతన్యం తీసుకువస్తూ, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక నష్టాలను వివరించారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసిన వారు ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మాదక ద్రవ్యాల సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుంటూనే, వ్యసన బాధితులకు పునరావాసం కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బయో-చెక్ కిట్ల ద్వారా డ్రగ్స్ వినియోగదారులను గుర్తించి, వారికి చికిత్స, కౌన్సెలింగ్ అందించి సాధారణ జీవితంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు మాట్లాడుతూ,ప్రజలు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు పోలీసులకు సహకరించి మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.