chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 30 August 2026, 11:17 am Digital Edition : CHITTOORE EXPRESS

డ్రగ్స్‌కు దూరంగా.. క్రీడలకు దగ్గరగా ఉండాలి కుప్పంలో లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో 3కే కరాటే రన్‌

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఆగస్టు 30:

 

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ క్రీడలు, మార్షల్‌ ఆర్ట్స్‌పై ఆసక్తి పెంచుకోవాలని లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు పిలుపునిచ్చారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కుప్పం వారియర్స్‌ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో 3కే కరాటే రన్‌ నిర్వహించారు. కడా కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ రన్‌ను పీఎంకే ఉడా చైర్మన్‌ ,బి.ఆర్‌. సురేష్‌బాబు, లయన్స్‌ క్లబ్‌ అడ్వైజర్‌ లయన్‌ ఎ.మహేష్‌ ప్రారంభించారు. ట్రెడిషనల్‌ అండ్‌ స్పోర్ట్స్‌ షోటోకాన్‌ కరాటే సంస్థకు చెందిన 200 మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కరాటే విద్యార్థులు పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా రన్‌ నిర్వహిస్తూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ క్రీడలు, మార్షల్‌ ఆర్ట్స్‌ ద్వారా యువతలో శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ఇటీవల చెన్నైలో నిర్వహించిన వరల్డ్‌ రికార్డ్‌ కరాటే ఈవెంట్‌లో కుప్పం ప్రాంతానికి చెందిన 23 మంది విద్యార్థులు పాల్గొనడాన్ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. రన్‌లో పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రశంసా పత్రాలను అందజేశారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్న కరాటే మాస్టర్‌ ఎక్కాంబరంను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ డా. వెంకటేష్‌, లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు సెల్వం, డైరెక్టర్లు ప్రసాద్‌, జయరాం నాయుడు, డా. సంజీవ్‌, పీఈటీ స్వాతి, కరాటే ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, లయన్స్‌ క్లబ్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.