
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 29:
చిత్తూరు జిల్లా కుప్పం పట్టణ పరిధిలోని డీకేపల్లి ప్రాంతంలో సోమవారం క్లస్టర్ ఇన్‌చార్జి కన్నన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఇంటింటి ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటరు జాబితాలో వివరాల సవరణ, ధృవీకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బృందం ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించి, అవసరమైన సమాచారాన్ని సేకరించింది. కొత్తగా ఓటరుగా నమోదు కావాల్సిన వారు, పేర్లు, చిరునామా లేదా ఇతర వివరాల్లో మార్పులు చేయించుకోవాల్సిన వారికి అవసరమైన సూచనలు అందించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా క్లస్టర్ ఇన్‌చార్జి కన్నన్ మాట్లాడుతూ.., ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. అవసరమైన పత్రాలను సంబంధిత అధికారులకు సమర్పించి తమ ఓటరు వివరాలను సరిచూసుకోవాలని సూచించారు. ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మణి, నభి, బాబు, బూత్ స్థాయి సిబ్బంది, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.