
ఎస్.ఆర్.పురం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై02:
ఎస్.ఆర్.పురం మండలంలోని క్షీరసముద్రం–జీఎంఆర్‌పురం మధ్య ఉన్న కల్వర్టు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో పలు గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు గురువారం ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. గ్రామస్తుల సమస్యను టీడీపీ జిల్లా నాయకుడు గంధమనేని రాజశేఖర్ నాయుడు, ఎస్.ఆర్.పురం మండల టీడీపీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే కల్వర్టును పరిశీలించి అధికారులతో చర్చించారు. కల్వర్టు నిర్మాణ పనులను అత్యంత త్వరలో ప్రారంభించి పూర్తి చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ఎన్‌ఆర్‌పురం డీఆర్‌డీఓ ప్రాంతం నుంచి సింధూ రాజపురంలోని అభయ ఆంజనేయస్వామి ఆలయం వరకు సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఆర్.పురం మండల టీడీపీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు, టీడీపీ జిల్లా నాయకుడు గంధమనేని రాజశేఖర్ నాయుడు, సహకార సంఘం చైర్మన్ నిరంజన్ రెడ్డి, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు గంధమనేని నరేష్ చౌదరి, ఆరిమాను గంగమ్మ ఆలయ చైర్మన్ జలంధర్ నాయుడు, క్లస్టర్ ఇన్‌చార్జి బాలాజీ నాయుడు, మాజీ మండల అధ్యక్షుడు భాస్కర్ నాయుడు, నియోజకవర్గ ఎస్సీ సెల్ కార్యదర్శి కుమార్, పొదలపల్లి ఆనందరావు, మాజీ సర్పంచ్ మణి, టీఎస్ కుప్పయ్య, నోమేష్ రెడ్డి, రామకృష్ణతో పాటు పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.