
తిరుపతి,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, జూలై 15:
విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని, మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు శివమూర్తి ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం తిరుపతి నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీ రవి మనోహర్ ఆచారికి ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఇటీవల రాష్ట్ర మంత్రుల సమక్షంలో తిరుపతి గ్రాండ్ రిడ్జ్ హోటల్‌లో జరిగిన టీడీపీ పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జిల సమావేశాన్ని కవర్ చేస్తున్న జర్నలిస్టులపై జరిగిన దాడిని ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా శివమూర్తి మాట్లాడుతూ, వార్తల సేకరణ కోసం వెళ్లిన జర్నలిస్టులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.జర్నలిస్టులను తీవ్రంగా గాయపరిచిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న జర్నలిస్టులకు తగిన రక్షణ కల్పించాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు జయశంకర్, సంయుక్త కార్యదర్శులు సురేష్, మునిచంద్రారెడ్డి, ఎగ్జిక్యూటివ్ సభ్యులు కళ్యాణ్, చంద్రకళ రెడ్డి, బాలమురళి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.