chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 8:17 am Digital Edition : CHITTOORE EXPRESS

జగన్ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటాం నిందితులకు కఠిన శిక్ష తప్పదు, బాధితులకు న్యాయం చేస్తాం:  ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి

వీకోట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 30:

 

పలమనేరు నియోజకవర్గం వీకోట మండల కేంద్రంలో ఇటీవల చోటుచేసుకున్న జర్నలిస్టు జగన్ హత్య ఘటనపై పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున పూర్తి భరోసా కల్పిస్తామని తెలిపారు. నిందితులు ఎంతటి వారైనా తప్పించుకునే అవకాశం లేదని, చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శాంతికి భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. ప్రశాంతంగా ఉండే వీకోటలో పట్టపగలు ఇలాంటి అమానుష ఘటన జరగడం బాధాకరమని పేర్కొన్నారు. హింసాత్మక సంఘటనలు సమాజానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరగా సానుకూల స్పందన లభించిందని తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపడతామని వెల్లడించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే, ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు నేరుగా సంప్రదించవచ్చని సూచించారు. సమాజంలో చెడు మూలకాలను నిర్మూలించకపోతే శాంతి భద్రతలకు ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలమనేరు ఉపవిభాగ అధికారి డేగల ప్రభాకర్, మండల తెలుగుదేశం నాయకులు రామచంద్ర నాయుడు, రాంబాబు, రంగనాథ్, ధీరజ్ తదితరులు పాల్గొన్నారు.