chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 9:47 pm Digital Edition : CHITTOORE EXPRESS

చిత్తూరు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించండి సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం అందించిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

చిత్తూరు, చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 28:

 

చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన పనులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి వినతిపత్రం అందించారు. మంగళవారం రాత్రి అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే నియోజకవర్గంలోని పలు కీలక అభివృద్ధి అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. చిత్తూరు నగరంతో పాటు నియోజకవర్గంలో చేపట్టాల్సిన ప్రధాన అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సీఎంకు వివరించారు. ముఖ్యంగా నీవా నది రీటైనింగ్ వాల్ నిర్మాణం, యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి తదుపరి చర్యలు చేపట్టడం, నగరంలో జరుగుతున్న ప్రధాన రహదారుల విస్తరణ పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయడం, అడవిపల్లి పైప్‌లైన్ పనులు, రిజర్వాయర్ పనులను వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించారు. చిత్తూరు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక సహకారం అందించాలని, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.