
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 21
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో పేదలకు ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి అన్న క్యాంటీన్ ట్రస్ట్‌కు 76 లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ విరాళంతో సోమవారం రాష్ట్రంలోని అన్న క్యాంటీన్లలో ప్రజలకు ఉచితంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా కుప్పం పట్టణంలోని అన్న క్యాంటీన్ వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్‌కు విరాళాలు అందించిన దాతలను గౌరవిస్తూ ప్రశంసా పత్రాలను అందజేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కుప్పం వారియర్స్ సభ్యులు,హర్ష ధర్మ తేజను గౌరవ గ్రహీతలుగా సత్కరించారు. కుప్పం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, లయన్స్ క్లబ్ సలహాదారు మహేష్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కస్తూరి వేలు, జయరాం నాయుడు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ సుదర్శన్, హరేకృష్ణ మిషన్ ప్రతినిధి భాస్కర్, అన్న క్యాంటీన్ పర్యవేక్షకురాలు మంజు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు నాణ్యమైన ఆహారం అందుతోందని, దాతలు ముందుకు వచ్చి ఈ సామాజిక సేవలో భాగస్వాములు కావాలని కోరారు.