
జడ్చర్ల,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 04:
ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2026పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వార్డు స్థాయిలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు అధికారి ప్రజలకు ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాముఖ్యత, చెత్త వేరు చేసే విధానం, పరిశుభ్రత వల్ల కలిగే ప్రయోజనాలపై వివరించారు. సమావేశంలో మాట్లాడుతూ ఇంటి నుంచి వచ్చే చెత్తను సరైన విధంగా వేరు చేసి, సేకరించి, శాస్త్రీయంగా నిర్వహించడానికే ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు రూపొందించబడినట్లు తెలిపారు. రోడ్లపై చెత్త పేరుకుపోకుండా చేయడం, కాలుష్యాన్ని తగ్గించడం, ప్రజారోగ్యాన్ని కాపాడడం, పరిశుభ్రమైన వార్డుల నిర్మాణం, వ్యర్థాలను వనరులుగా మార్చడం ఈ నిబంధనల ప్రధాన లక్ష్యమని వివరించారు. ప్రతి కుటుంబం తమ ఇంటి వద్దనే చెత్తను నాలుగు రకాలుగా వేరు చేయాలని సూచించారు. తడి చెత్తలో ఆహార అవశేషాలు, కూరగాయల తొక్కలు, పూలు వంటి వాటిని, పొడి చెత్తలో ప్లాస్టిక్, కాగితం, గాజు వంటి వస్తువులను, శానిటరీ వ్యర్థాలలో డైపర్లు, శానిటరీ న్యాప్‌కిన్లు, ప్రత్యేక వ్యర్థాలలో బ్యాటరీలు, బల్బులు, గడువు ముగిసిన మందులను వేర్వేరుగా నిల్వ చేయాలని సూచించారు. చెత్తను వేరు చేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందిస్తే పునర్వినియోగ ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతుందని, దుర్వాసన, కాలుష్యం, వ్యాధులు పెరిగే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. రోడ్లపై, ఖాళీ స్థలాల్లో, కాలువల్లో చెత్త వేయకూడదని ప్రజలకు సూచించారు. ఇళ్లలో కనీసం రెండు లేదా నాలుగు చెత్త డబ్బాలను ఏర్పాటు చేసుకోవాలని, ఇంటింటి చెత్త సేకరణ వాహనం వచ్చినప్పుడు మాత్రమే చెత్త అందించాలని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, తడి చెత్తతో సేంద్రియ ఎరువుల తయారీకి ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. అపార్ట్‌మెంట్లు, హోటళ్లు,ఫంక్షన్ హాళ్లు వంటి భారీ వ్యర్థాల ఉత్పత్తిదారులు తమ వ్యర్థాలను తామే శాస్త్రీయంగా నిర్వహించే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. చెత్తను సక్రమంగా నిర్వహించకపోతే దోమలు, ఈగలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని వివరించారు. “నా ఇల్లు శుభ్రం – నా వీధి శుభ్రం – నా వార్డు శుభ్రం” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ ఒక్కటే పరిశుభ్రతను కాపాడలేదని, ప్రతి కుటుంబం సహకరిస్తేనే పరిశుభ్రమైన వార్డు నిర్మాణం సాధ్యమవుతుందని వార్డు అధికారి తెలిపారు. సమావేశంలో వార్డు ప్రజలు, మహిళలు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని పరిశుభ్రత కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.