chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 8:27 am Digital Edition : CHITTOORE EXPRESS

గ్రేస్ మరియా అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత:  సీఐ మల్లేష్ యాదవ్

 

శాంతిపురం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, జూన్05:

 

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం శాంతిపురం బస్టాండ్ కూడలి వద్ద గ్రేస్ మరియా చారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కుప్పం రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జె.మల్లేష్ యాదవ్, రాళ్లబుదుగూరు ఎస్సై ఐ.నరేష్, గుడిపల్లి ఎస్సై శ్రీకాంత్, పోలీసు సిబ్బంది పాల్గొని విద్యార్థులకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణకు, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించి పెంచడం కూడా సమాన బాధ్యత అని అన్నారు. పచ్చదనం పెరిగితేనే స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన జీవన వాతావరణం లభిస్తుందని తెలిపారు. విద్యార్థులు చిన్న వయస్సు నుంచే చెట్ల పెంపకంపై ఆసక్తి పెంచుకుని ప్రకృతి సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాళ్లబుదుగూరు ఎస్సై ఐ. నరేష్ మాట్లాడుతూ చెట్ల పెంపకం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు కాలుష్యరహిత, ఆరోగ్యకర మైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, ప్రజలు సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రేస్ మరియా చారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తా మని తెలిపారు. మొక్కల పెంపకం ద్వారా ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు,ట్రస్ట్ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొని మొక్కలను స్వీకరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కార్యక్రమంలో పిలుపునిచ్చారు.