
శాంతిపురం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్ , జూలై 29:
గురు పూర్ణిమ సందర్భంగా శాంతిపురం మండలంలోని రాళ్లబూదుగూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం యోగా విద్యార్థుల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలకు యోగాభ్యాసం నేర్పుతూ ఆరోగ్య చైతన్యం కల్పిస్తున్న డాక్టర్ మయూర్ వి. కాకు, డాక్టర్ సామ్య శ్రీ మయూర్ కాకు దంపతులను యోగా విద్యార్థులు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గౌని వారి శ్రీనివాసులు మాట్లాడుతూ.., గురువుల స్థానం సమాజంలో అత్యున్నతమైందని అన్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని పేర్కొన్నారు. యోగా గురువులు సమాజానికి అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ మయూర్ వి. కాకు దంపతులు మాట్లాడుతూ, యోగాను ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యోగా పాఠశాల సభ్యులు, గ్రామ ప్రముఖులు, మహిళలు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.