chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 11:08 pm Digital Edition : CHITTOORE EXPRESS

గుత్తార్లపల్లిలో పోలీసుల అవగాహన కార్యక్రమం

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి08:

 

చిత్తూరుజిల్లా గుడుపల్లి మండలంలోని గుత్తార్లపల్లి గ్రామంలో ఆదివారం పోలీసుల ఆధ్వర్యంలో ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కుప్పం రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మల్లేష్ యాదవ్ గ్రామాన్ని సందర్శించి స్థానికులతో సమావేశమై పలు సామాజిక సమస్యలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ‘ధైర్య స్పర్శ’ కార్యక్రమం లక్ష్యాలు, మహిళలు, బాలికల రక్షణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. బాల్య వివాహాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, చిన్న వయసులో జరిగే వివాహాలు పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. అలాగే రోడ్డు భద్రతకు సంబంధించి వాహనదారులు పాటించాల్సిన నియమాలను వివరించి, హెల్మెట్ వినియోగం, వేగ నియంత్రణ వంటి అంశాలపై సూచనలు ఇచ్చారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అపరిచిత ఫోన్ కాల్స్, సందేశాలు, ఆన్‌లైన్ లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, యువతపై పడే ప్రతికూల ప్రభావాలను వివరించారు. పిల్లలపై జరిగే లైంగిక దాడులను నిరోధించేందుకు అమలులో ఉన్న పోక్సో చట్టం గురించి కూడా వివరించి, అనుమానాస్పద సంఘటనలు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఇళ్లలో దొంగతనాలు జరగకుండా ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను తెలియజేస్తూ గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొని తమ సందేహాలను అడిగి తెలుసుకున్నారు.