chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 9:47 pm Digital Edition : CHITTOORE EXPRESS

గుడుపల్లెలో హత్య కేసు ఛేదన ఏడుగురు నిందితుల అరెస్ట్  కత్తులు, రెండు మోటార్ సైకిళ్లు స్వాధీనం డిఎస్పీ పార్థసారథి

గుడుపల్లె,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూలై 18 :

 

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లె మండలంలో ఇటీవల సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాళ్ళబుదుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తులు, రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు డిఎస్పీ పార్థసారథి తెలిపారు. శనివారం స్థానిక డిఎస్పీ కార్యాలయం నందు నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రిష్ణగిరి జిల్లా సూలగిరి ప్రాంతానికి చెందిన రమేష్ గుడుపల్లె మండలం మల్లప్ప కొండ వద్ద హత్యకు గురైనట్టు తెలిపారు. మృతుడి భార్య హాసినికి గంగాధర్ తో వారి వివాహానికి ముందే పరిచయం ఉందని, వారిద్దరూ ప్రేమించుకున్నా, హాసినికి రమేష్ తో పెద్దలు పెళ్లి చేయడం జరిగిందన్నారు. కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగినా, హాసినికి తన ప్రియుడితో ఉన్న అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్టు తన భర్త రమేష్ కు తెలిసిందన్నారు. ఈ విషయమై మందలించిన భర్త తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని భావించి, అతని భార్య హాసిని తన ప్రియుడు గంగాధర్ తో కలిసి భర్త హత్యకు పథకం పన్నినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో గంగాధర్ తన స్నేహితుల సహకారంతో కలిసి ఈ నెల 13న రమేష్ ను తన భార్య సహాయంతో బోయినపల్లికి రప్పించి, ఆపై భార్యాభర్తలు ఇరువురు కలిసి మల్లప్ప కొండకు తెలిపారు. అక్కడ వారు ముందుగా పన్నిన ప్రణాళిక ప్రకారం హత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ హత్య విషయం తమ దృష్టికి రాగానే చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు రూరల్ సీఐ మలేష్ యాదవ్, రాళ్ళబుదుగూరు, గుడుపల్లి, రామకుప్పం, కుప్పం ఎస్సైలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసును చేదించినట్టు తెలిపారు. ఈ క్రమంలో నిందితులలో హాసిని గంగాధర్ లతోపాటు పవన్, శేఖర్, సంతోష్ సురేంద్ర లను అదుపులోనికి తీసుకున్నట్టు తెలిపారు. మరో ఇద్దరు నిందితులు శ్యాంసన్, శివలు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్టు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితులను రిమాండ్ కు పంపుతున్నట్టు తెలిపారు.