
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 06:
గుడుపల్లి నుంచి కుప్పం వెళ్లే ప్రధాన రహదారిలోని రైల్వే లెవెల్ క్రాసింగ్ గేటు నంబరు–103 వద్ద మరమ్మత్తు పనులు చేపట్టనున్న నేపథ్యంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు రహదారిపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు కుప్పం రైల్వే పోలీసులు తెలిపారు. జూన్ 6వ తేదీ రాత్రి 10 గంటల నుంచి జూన్ 7వ తేదీ ఉదయం 4 గంటల వరకు రైల్వే గేటు పరిసర ప్రాంతంలో మరమ్మత్తు పనులు నిర్వహించనున్నందున ఆ సమయంలో రహదారిని పూర్తిగా మూసివేయనున్నట్లు వెల్లడించారు. ఈ కారణంగా గుడుపల్లి–కుప్పం మార్గంలో ప్రయాణించే వాహనదారులు ట్రాఫిక్ అంతరాయం, రద్దీ సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు వాహనదారులు ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. మరమ్మత్తు పనులు పూర్తయ్యే వరకు ప్రజలు సహకరించాలని, ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులకు సహాయపడాలని కోరారు. రైల్వే భద్రతా ప్రమాణాల మేరకు ఈ పనులు చేపడుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కుప్పం రైల్వే పోలీసులు విజ్ఞప్తి చేశారు.