
చిత్తూరు, చిత్తూరు ఎక్స్ ప్రెస్, సెప్టెంబర్ 28:
(గుడిపాల)గ్రామీణ ప్రాంతాల్లోని ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మెరుగైన శిక్షణ, సేవలు అందించేందుకు గుడిపాలలో ఆటిజం కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. సోమవారం ఎంపీతో కలిసి ఎమ్మెల్యే ఆటిజం కేంద్ర భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సర్వశిక్షా అభియాన్ కింద రూ.28 లక్షల వ్యయంతో ఆటిజం కేంద్ర భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందించేందుకు కృషి చేస్తోందన్నారు. అనంతరం నరహరిపేట ఉన్నత పాఠశాల విద్యార్థులతో ఎంపీ, ఎమ్మెల్యే ముఖాముఖి మాట్లాడారు. ఇటీవల క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఎమ్మెల్యే తరఫున రూ.10 వేల నగదు ప్రోత్సాహకాన్ని ఎంపీ చేతుల మీదుగా అందజేశారు. విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో శిరీష, తహసీల్దార్ శ్రీనివాసులు, మండల పార్టీ అధ్యక్షుడు సుబ్బానాయుడు, ధనసింగ్, బాలసుబ్రహ్మణ్యం యాదవ్, పీఏసీఎస్ అధ్యక్షుడు ప్రతాప్ నాయుడు, మాజీ ఎంపీపీలు అనిల్ దీపశ్రీ, గోళ్ల హరి, నాగరాజు యాదవ్, మాజీ జడ్పీటీసీ సుమతి, గోళ్ల హేమాద్రి నాయుడు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.