
రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఆగస్టు06 :
తిరుపతి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా రేణిగుంట పట్టణ పోలీసులు గురువారం విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో “గంజాయి నిర్మూలిద్దాం – Action After Awareness” అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఆటో, క్యాబ్ డ్రైవర్లకు గంజాయి వినియోగ నిర్ధారణ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. మాదకద్రవ్యాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, యువత భవిష్యత్తును గంజాయి వంటి మత్తు పదార్థాలు నాశనం చేస్తున్నాయని అధికారులు వివరించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక ప్రచార బస్సును ఏర్పాటు చేసి, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలను చిత్రాల ద్వారా వివరించారు. “పరీక్ష చేద్దాం – మత్తును వదిలిద్దాం” అనే సందేశంతో డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ జయచంద్ర మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, డీఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. గంజాయి కిట్ల ద్వారా వ్యక్తులు గంజాయి సేవించారా లేదా అనే విషయాన్ని గుర్తించవచ్చని చెప్పారు. గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు,వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 1972 లేదా 112 నంబర్లకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.