chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 11:46 am Digital Edition : CHITTOORE EXPRESS

కొత్తపేటలో లింక్ రోడ్డు విస్తరణకు శ్రీకారం ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం

కుప్పం, చిత్తూరు ఎక్స్‌ప్రెస్, జూలై 17:

 

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటలో నేషనల్ హైవే బైపాస్ నుంచి ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ దేవస్థానం మీదుగా క్రిష్ణగిరి బైపాస్ రోడ్డు వరకు చేపట్టనున్న లింక్ రోడ్డు విస్తరణ పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు మెరుగైన రాకపోకల సౌకర్యం కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యమని నాయకులు తెలిపారు. రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి కడా సలహాదారు ఎస్. రాజ్‌కుమార్, మున్సిపల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాణిపాకం వెంకటేష్, క్లస్టర్ ఇన్‌చార్జి కన్నన్, కొత్తపేట ఇన్‌చార్జి అప్పు ముఖేష్, టీఎన్‌ఎస్‌ఎఫ్ ఉపాధ్యక్షుడు మునెప్ప ఆలయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి పనుల పురోగతి, భూసేకరణ, స్థానికుల సహకారం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, లింక్ రోడ్డు నిర్మాణం పూర్తయిన అనంతరం కొత్తగా అభివృద్ధి చెందుతున్న కాలనీలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని, కొత్తపేట ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న ట్రాఫిక్ సమస్య గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రజలు సురక్షితంగా, వేగంగా ప్రయాణించే అవకాశం కలుగుతుందని తెలిపారు. కుప్పం పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు అందించేందుకు అభివృద్ధి పనులను వేగవంతంగా చేపడుతున్నట్లు వెల్లడించారు. స్థానిక ప్రజల సహకారంతో రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, స్థానిక కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.