chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 20 October 2026, 6:01 pm Digital Edition : CHITTOORE EXPRESS

కొడిసెలగూడెంలో ఘనంగా రావణబ్రహ్మ ఊరేగింపు గిరిజన సంప్రదాయాలు, డోలు వాయిద్యాలు, నృత్యాల నడుమ వైభవంగా నిర్వహణ

కొడిసెలగూడెం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,అక్టోబర్ 20:

 

మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులోని గడ్చిరోలీ జిల్లా సిరోంచా తాలూకా కొడిసెలగూడెం శ్రీ రావణబ్రహ్మేశ్వర ఆలయంలో మంగళవారం భగవాన్ రావణబ్రహ్మ ఊరేగింపు కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గోండు ఆదివాసీల ఆరాధ్యదైవంగా భావించే రావణబ్రహ్మను దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, గిరిజన తెగల పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, గోంగో పూజ, మహాపూజ నిర్వహించారు. అనంతరం రావణబ్రహ్మ విగ్రహాన్ని సుందరంగా అలంకరించి, డోలు వాయిద్యాలు, గిరిజన నృత్యాల నడుమ గ్రామ వీధుల్లో ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులు సంప్రదాయ పద్ధతుల్లో పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. రావణబ్రహ్మ తమ గోండు తెగకు చెందిన గొప్ప పండితుడని, తమ పూర్వీకుడిగా భావించి ఆరాధిస్తామని పలువురు గిరిజనులు పేర్కొన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలు, ఆచారాలను భవిష్యత్ తరాలకు అందించడమే తమ లక్ష్యమని ఇందూ జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ప్రత్యేక గుర్తింపు కలిగిన ఈ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని భక్తులు కోరారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ సాంబయ్య, ఆలయ పూజారులు, గోండ్వానా సేవా సమితి సభ్యులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.