chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 9:59 am Digital Edition : CHITTOORE EXPRESS

కె.డి.పల్లి గ్రామంలో ధైర్య-స్పర్శ కార్యక్రమం..  ప్రజలకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించిన పోలీసులు డి.ఎస్.పి పార్థసారథి 

కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 21:

 

చిత్తూరు జిల్లా కుప్పం మండలం కె.డి.పల్లి గ్రామంలో శనివారం రాత్రి నిర్వహించిన ధైర్య-స్పర్శ కార్యక్రమంలో భాగంగా పోలీసులు గ్రామాన్ని సందర్శించి ప్రజలకు భద్రత, ఆరోగ్యం, సామాజిక బాధ్యతలకు సంబంధించిన పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో కుప్పం డీఎస్పీ పార్థసారధి ఆధ్వర్యంలో కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్, పోలీసు సిబ్బంది పాల్గొని గ్రామ ప్రజలు, మహిళలు, యువత, విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమాజంలో పెరుగుతున్న నేరాలు, మోసాలు, మత్తు పదార్థాల వినియోగం వంటి సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, నాలుగు చక్రాల వాహనాల్లో సీటు బెల్టు వినియోగించడం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని వివరించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం, పోలీసు శాఖ అందిస్తున్న సేవలను ప్రజలకు వివరించారు. పిల్లలపై జరిగే లైంగిక వేధింపులు, దాడుల నివారణకు పోక్సో చట్టం కింద ఉన్న కఠిన నిబంధనలను తెలియజేశారు. చిన్నారులకు మంచి స్పర్శ, చెడు స్పర్శ గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులను నమ్మవద్దని హెచ్చరించారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ నంబర్లు, పాస్‌వర్డులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. ఆన్‌లైన్ మోసాలకు గురైన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ జీవితం, భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతింటుందని వివరించారు. అలాగే ఐపీఎల్ బెట్టింగ్, అక్రమ ఆన్‌లైన్ జూదాలకు దూరంగా ఉండాలని, అలాంటి కార్యకలాపాల్లో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ధైర్య-స్పర్శ కార్యక్రమం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు, గ్రామస్థులు నిర్భయంగా తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచించారు. గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తూ, ఇలాంటి అవగాహన కార్యక్రమాలు తరచూ నిర్వహించడం వల్ల సమాజంలో భద్రతా చైతన్యం పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.