
కుప్పం, చిత్తూరు ఎక్స్ప్రెస్ ,సెప్టెంబర్ 16:
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండల పరిధిలోని కెనమాకులపల్లి గ్రామంలో మూడవ రోజు వినాయక చవితి వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించారు. కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, గ్రామంలో శాంతి సౌభాగ్యాలు నెలకొనాలని స్వామివారిని ప్రార్థించారు. అనంతరం వినాయకుడిని పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. మహిళలు మంగళహారతులతో స్వామివారికి స్వాగతం పలకగా, యువత ఉత్సాహంగా రంగులు చల్లుకుంటూ నృత్యాలతో సందడి చేశారు. *రూ.52 వేలతో కాణిపాకం లడ్డు వేలం* వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన కాణిపాకం లడ్డు వేలంపాటలో చిట్టి నాయుడు ఈడుగ చరణ్ రూ.52 వేలతో లడ్డూను కైవసం చేసుకున్నారు. వేలంపాట సందర్భంగా భక్తులు, గ్రామస్తుల్లో ఉత్సాహం నెలకొంది. అలాగే మంగళవారం సాయంత్రం నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి గ్రామ పెద్దల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాదాలను పంపిణీ చేయగా, పెద్ద సంఖ్యలో భక్తులు స్వీకరించారు. భక్తిశ్రద్ధలు, యువత ఉత్సాహం, మహిళల మంగళహారతులతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. చివరగా వినాయకుడి నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.