
కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,జూలై 28:
చిత్తూరుజిల్లా కుప్పం నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఎమ్మార్పీఎస్ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని వారు కోరారు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గంలోని పలు కీలక సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఎస్సీ వర్గాల సంక్షేమం, పేదలకు న్యాయం, భూ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువుల ఆక్రమణల తొలగింపు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల సృష్టి వంటి అంశాలపై సమగ్రంగా వివరించారు. అలాగే అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని, కుప్పం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. వినతిపత్రాన్ని స్వీకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మార్పీఎస్ నాయకులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ, కుప్పం నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ ప్రజల పక్షాన తమ పోరాటాన్ని కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ. ప్రకాష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు పి. వెంకటేష్ మాదిగ, కుప్పం నియోజకవర్గ కో-ఇన్‌చార్జ్ గోవిందప్ప మాదిగ, రామకుప్పం మండల సీనియర్ నాయకులు జయప్ప మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ మండల అధ్యక్షులు శంకర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.