కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి 08:
కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మిషన్ శక్తి పథకం కింద ‘సఖి వన్ స్టాప్ సెంటర్’ను ఆదివారం ప్రారంభించారు. ఆసుపత్రి కమిటీ ఉపాధ్యక్షురాలు భాగ్యలక్ష్మి త్రిలోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉపాధ్యక్షులు పి.ఎస్. మునిరత్నం, పి.కె.ఎం పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ డాక్టర్ సురేష్ బాబు ముఖ్య అతిథులుగా విచ్చేసి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కేంద్రం ద్వారా మహిళలకు అత్యవసర సహాయం, చట్టపరమైన సలహాలు, వైద్య సేవలు మరియు కౌన్సిలింగ్ సేవలు ఒకే చోట అందించబడతాయని తెలిపారు. మహిళలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నా 181 మహిళల సహాయ కేంద్రానికి ఫోన్ చేసి తక్షణ సహాయం పొందవచ్చని అధికారులు వివరించారు. మహిళల భద్రత, గౌరవం మరియు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మహిళల సాధికారత మరియు భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కేంద్రాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని, మహిళలకు అవసరమైన అన్ని సేవలు ఒకే చోట అందే విధంగా ఈ ‘సఖి వన్ స్టాప్ సెంటర్’ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన అధికారులకు వారు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఆసుపత్రి సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.