chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 6:32 am Digital Edition : CHITTOORE EXPRESS

కుప్పం ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలపై ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ఆరా డిజిటల్‌ నెర్వ్‌ సెంటర్‌, సీటీ స్కాన్‌ కేంద్రాల పరిశీలన.. వైద్యులతో సమీక్ష

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,సెప్టెంబరు 01:

 

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వాసుపత్రి ద్వారా మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు సూచించారు. కుప్పం పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన స్థానిక ప్రభుత్వాసుపత్రిని సందర్శించి వైద్య విభాగాలు, అందు బాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. ఆసుపత్రి కమిటీ సభ్యులతో కలిసి ఉపాధ్యక్షురాలు భాగ్యలక్ష్మి త్రిలోక్‌, పీకేఎం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌ డాక్టర్‌ బీఆర్‌ సురేష్‌బాబు ఎంపీకి స్వాగతం పలికారు. అనంతరం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డిజిటల్‌ నెర్వ్‌సెంటర్‌ను ఎంపీ పరిశీలించారు. కేంద్రంలో అందుతున్న వైద్య సేవలు, రోగుల నిర్ధారణకు వినియోగిస్తున్న సాంకేతిక సదుపాయాలు, ఇప్పటివరకు అందించిన సేవల వివరాలను వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.నాడీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి స్థానికంగానే మెరుగైన వైద్యం అందించడంలో కేంద్రం పనితీరుపై ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో ఇటీవల ప్రారంభ మైన సీటీస్కాన్‌ కేంద్రాన్నిపరిశీలించారు. సీటీ స్కాన్‌ సేవల ద్వారా రోగులకు కలుగుతున్న ప్రయోజనాలు, పరీక్షల నిర్వహణ విధానం, రోజువారీగా వస్తున్న కేసుల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అత్యవసర సమయాల్లో సీటీ స్కాన్‌ సేవలు స్థానికంగానే అందుబాటులో ఉండటం వల్ల రోగులకు సమయం, ఖర్చు ఆదా అవుతుందని అధికారులు ఎంపీకి వివరించారు.

*వైద్యులతో సమీక్ష*

తదుపరి స్థానిక వైద్యులతో ఎంపీ ప్రసాదరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రస్తుతం అందుతున్న వైద్య సేవలు, డిజిటల్‌ నెర్వ్‌ సెంటర్‌, సీటీ స్కాన్‌ కేంద్రాల పనితీరు,రోగులకు అందుతున్న సేవలు, వైద్య పరికరాల వినియోగంపై సమగ్రంగా వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు అవసరమైన వైద్యసేవలను సకాలంలో అందించాలని, అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య పరికరాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని వైద్యులకు సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని, అవసరమైన సదుపాయాల మెరుగుదలకు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రిలో అందు బాటులో ఉన్న వైద్య సదుపాయాలపై ప్రజలకు అవగాహన కల్పించి, వాటిని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ సూచించారు. కార్యక్రమంలో రెస్కో చైర్మన్ ప్రతాప్ , వైస్ చైర్మన్ త్రిలోక్ భాగ్యలక్ష్మి, డాక్టర్ సుధీర్, సుగుణమ్మ , మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ,ఆసుపత్రి కమిటీ సభ్యులు, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.