కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి 11:
పరిశుభ్రమైన పట్టణ నిర్మాణం కోసం ప్రతి ఇంటి నుంచి చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి ఇవ్వడం ఎంతో ముఖ్యమని కుప్పం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో సోర్స్ సెగ్రిగేషన్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రతిరోజూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం కుప్పం పట్టణంలోని ప్రగ్ఞా స్కూల్‌లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విద్యార్థులకు చెత్త నిర్వహణ ప్రాముఖ్యత, తడి చెత్త (ఆహార అవశేషాలు, కూరగాయల తొక్కలు వంటి పదార్థాలు), పొడి చెత్త (ప్లాస్టిక్, కాగితం, లోహ పదార్థాలు) మధ్య తేడా గురించి వివరంగా తెలియజేశారు. ఇంటి వద్ద నుంచే చెత్తను వేరు చేయడం వల్ల చెత్తను సక్రమంగా శుద్ధి చేయడం సులభమవుతుందని, దీనివల్ల పర్యావరణ కాలుష్యం తగ్గి పరిశుభ్రత పెరుగుతుందని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు కూడా చెత్త వేరు చేయడం పై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.