chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 08 June 2026, 12:47 pm Digital Edition : CHITTOORE EXPRESS

కుప్పం పట్టణంలో సీసీ కెమెరాల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలి ఎస్పీ గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందజేసిన  మునిసిపల్ ఫ్లోర్ లీడర్ జిమ్ దాము

కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,జూన్ 08:

 

చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడానికి ప్రధాన కూడళ్లు, ప్రధాన రహదారుల్లో సీసీ కెమెరాలను పునరుద్ధరించి, అవసరమైన చోట్ల కొత్త కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరుతూ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ జిమ్ దాము సోమవారం జిల్లా ఎస్పీ నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2019కు ముందు కుప్పం పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రహదారుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటి పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో పట్టణంలో భద్రతా వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసిందని, నేరాల నివారణతో పాటు ట్రాఫిక్ నిర్వహణకు కూడా కెమెరాలు ఎంతో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం నిర్వహణ లోపం కారణంగా పలుచోట్ల కెమెరాలు పనిచేయడం లేదని, మరికొన్ని ప్రాంతాల్లో అసలు కెమెరాలు లేకపోవడంతో భద్రతా పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. పట్టణ విస్తరణకు అనుగుణంగా కొత్త కాలనీలు, రద్దీ ప్రాంతాలు ఏర్పడిన నేపథ్యంలో అదనపు సీసీ కెమెరాల ఏర్పాటు అవసరమైందన్నారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణతో పాటు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ పర్యవేక్షణకు సీసీ కెమెరాల వ్యవస్థ అత్యంత కీలకమని పేర్కొన్నారు. అందువల్ల ప్రస్తుతం పనిచేయని కెమెరాలను మరమ్మతులు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావడంతో పాటు, అవసరమైన ప్రాంతాల్లో కొత్త కెమెరాలను ఏర్పాటు చేసి ఆధునిక సౌకర్యాలతో కూడిన కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సురేష్ నాయుడు, మాజీ ఎంపీటీసీ ఉమాపతి నరేష్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు ఈ వినతిపై సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.