

కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూలై 03:
కుప్పం అంటే నాకు ఒక నియోజకవర్గం మాత్రమే
కాదు… అది నా భావోద్వేగం అని స్వర్ణ కుప్పం విజన్–2029 సాధన కోసం మూడు రోజుల పాటు కుప్పంలోనే ఉండి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలిస్తానని,కుప్పాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం అని గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
శుక్రవారం నాడు జూలై 3 నుంచి 5 వరకు మూడు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గారు గుడిపల్లి మండలంలోనీ పొగురుపల్లి గ్రామంలో స్వర్ణకుప్పం పెట్టుబడుల కు వేదిక కార్యక్రమాల అమలులో భాగంగా వివిధ కంపెనీల ఒప్పందాలు శంకుస్థాపనలు భూమి పూజలు పలు కార్యక్రమాలలో ముఖ్యమంత్రివర్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో
చిత్తూరు ఎం.పి దగ్గుమల్ల ప్రసాద్,జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఏ.పి.ఐ.ఐ సి డైరెక్టర్ ప్రేమ కుమార్, పలు పరిశ్రమల పెట్టుబడిదారులు పాల్గొనారు.
అనంతరం గౌ.ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడుతూ …
గత రెండేళ్లలో కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి వేగం గణనీయంగా పెరిగిందని, తాను కుప్పానికి వచ్చిన ప్రతిసారి కొత్త మార్పును చూస్తున్నానని పేర్కొన్నారు. నలభై ఎనిమిది సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎనిమిదోసారి కుప్పం ఎమ్మెల్యేగా, నాలుగోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించే అవకాశం కల్పించిన కుప్పం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎక్కడ ఉన్నా తన మనసు ఎప్పుడూ కుప్పం ప్రజలపైనే ఉంటుందని, కుప్పాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన సంకల్పమని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే మూడు స్తంభాలపై ఆరోగ్యవంతమైన, సంపన్నమైన, సంతోషకరమైన సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి ఉపాధి, ప్రతి యువకుడికి ఉద్యోగం, ప్రతి రైతుకు అధిక ఆదాయం, ప్రతి గ్రామానికి అభివృద్ధి అందించడమే ప్రభుత్వ విధానమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై Ease of Doing Business మాత్రమే కాదు, Speed of Doing Business కూడా ప్రభుత్వ ప్రత్యేకతగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించే ప్రతి పారిశ్రామికవేత్త పరిశ్రమ ప్రభుత్వానిదిగానూ భావించి, ప్రభుత్వం–పారిశ్రామికవేత్తలు భాగస్వాములుగా కలిసి విజయవంతం చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కుప్పంలో రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు ఏర్పాటు కానుండగా, వీటి ద్వారా సుమారు 39 వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. రూ.200 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఏబీఐఎస్ ప్రోటీన్స్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా రైతులకు, అనుబంధ రంగాలకు, యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. అలాగే 44 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్క్ ద్వారా వందలాది సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఏర్పడి స్థానిక యువతకు ఉపాధి కల్పించడంతో పాటు స్టార్టప్‌లకు ప్రోత్సాహం లభిస్తుందని వివరించారు. కుప్పం నుంచే “ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త (One Family – One Entrepreneur)” కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా పరిశ్రమలు, స్టార్టప్‌లు స్థాపించి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ఉత్తమ పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకువస్తానని, ఉత్తమ ఉద్యోగాలు కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ, డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా లక్షకు పైగా సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటు చేసి, వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు అందించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని వెల్లడించారు. స్వర్ణ కుప్పం విజన్–2029లో భాగంగా గ్రామాలన్నింటిలో సిమెంట్ రోడ్లు, పట్టణాలకు బీటీ రోడ్లు, జాతీయ రహదారులతో అనుసంధానం, రైల్వే కనెక్టివిటీ, విమాన సౌకర్యం కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. బెంగళూరు–చెన్నై ఆర్థిక కారిడార్ ప్రయోజనాలను పూర్తిగా వినియోగించుకునేలా కుప్పాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. పొగురుపల్లి నుంచి బెంగళూరుకు నేరుగా అనుసంధానించే రహదారి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని వెల్లడించారు. కుప్పాన్ని హరిత నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంతో వేలాది ఇళ్లపై సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నామని, మరిన్ని ఇళ్లలో సోలార్ ఏర్పాటుకు ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. 70 శాతం గ్రీన్ కవర్, నెట్ జీరో కాలుష్యం, గ్రీన్ ఎనర్జీ వినియోగం, ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, వ్యర్థాల నుంచి ఇంధనం మరియు విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ దహనవాటికల ఏర్పాటు వంటి కార్యక్రమాల ద్వారా కుప్పాన్ని స్వచ్ఛమైన, పర్యావరణహిత నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. రోడ్లపై చెత్త వేయకుండా ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కుప్పంలో ఎవ్వరూ నిరుద్యోగులుగా ఉండకూడదనే లక్ష్యంతో పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కార్యక్రమాలను అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. చదువుతో పాటు నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవాలని, కొత్త విషయాలు నేర్చుకోవాలని యువతకు సూచించారు. పరిశ్రమల్లో పనిచేస్తూనే డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ చదివే అవకాశాలు కల్పించేలా ద్రావిడ విశ్వవిద్యాలయంతో అనుసంధానం చేస్తామని తెలిపారు. శ్రీ సిటీలో అమలు చేస్తున్న పరిశ్రమ–విద్యా నమూనాను కుప్పంలో కూడా విస్తరించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంపై విశ్వాసంతో వివిధ రాష్ట్రాలతో పోటీని అధిగమించి ప్రముఖ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. బ్యాటరీ అనోడ్ మెటీరియల్, విమాన భాగాల తయారీ, గ్రీన్ బిల్డింగ్ మెటీరియల్స్, ఆహార ప్రాసెసింగ్, దుస్తుల తయారీ, నానో టెక్నాలజీ, ఆధునిక తయారీ రంగాల్లో అనేక సంస్థలు కుప్పంలో పెట్టుబడులు పెట్టడం ప్రాంత భవిష్యత్తుకు శుభపరిణామమని పేర్కొన్నారు. పొగురుపల్లిని అత్యుత్తమ ఇండస్ట్రియల్ పార్క్‌తో పాటు ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కుప్పాన్ని విద్యా కేంద్రం, పర్యాటక కేంద్రం, పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు ప్రపంచ స్థాయి బ్లూ గ్రానైట్ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఒకప్పుడు వెనుకబడిన కుప్పాన్ని అభివృద్ధికి కేంద్రంగా మార్చామని చెప్పారు.
గత రెండేళ్లలో కుప్పం స్థూల ఆర్థిక ఉత్పత్తి, తలసరి ఆదాయం, సాగు విస్తీర్ణం, పాల ఉత్పత్తి, సూక్ష్మ సాగునీటి విస్తరణ, పంటల ఉత్పత్తి వంటి అన్ని రంగాల్లో గణనీయమైన వృద్ధి నమోదైందని తెలిపారు. ప్రతి ఇంటికి తాగునీరు, ఎల్ఈడీ వీధి దీపాలు, సిమెంట్ రోడ్లు, ఆరోగ్య పరీక్షలు, పిల్లల్లో పోషకాహార లోపాల నివారణ, పీ–4 కార్యక్రమం ద్వారా వేలాది కుటుంబాలను కార్పొరేట్ సంస్థలు దత్తత తీసుకోవడం వంటి కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయని వివరించారు.
రైతులను రైతు ఉత్పత్తిదారుల సంఘాల (FPOలు) ద్వారా మార్కెట్‌తో నేరుగా అనుసంధానం చేసి మధ్యవర్తులు లేకుండా అధిక ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి మహిళ ఆదాయం సంపాదించేలా, ప్రతి యువకుడు ఉపాధి పొందేలా, ప్రతి రైతు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పడుతుందని పేర్కొన్నారు.కుప్పంలో ఏర్పడిన పరిశ్రమలు విజయవంతమైతే మరిన్ని పరిశ్రమలు వస్తాయని, దాంతో కొత్త అవకాశాలు, కొత్త ఆలోచనలు, కొత్త పారిశ్రామికవేత్తలు రూపుదిద్దుకుంటారని తెలిపారు. అభివృద్ధికి ఆటంకం కలిగించే వారిని ప్రజలు ప్రోత్సహించరని స్పష్టం చేశారు.మూడు రోజుల పాటు కుప్పంలోనే ఉండి అన్ని అభివృద్ధి కార్యక్రమాలను సమగ్రంగా పరిశీలించి, అవసరమైన నిర్ణయాలు తీసుకుంటానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని, పనుల్లో లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దుతానని ముఖ్యమంత్రి తెలిపారు. కుప్పాన్ని రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నియోజకవర్గంగా, దేశంలోనే ఆదర్శ అభివృద్ధి నమూనాగా నిలబెట్టడమే తన లక్ష్యమని పునరుద్ఘాటించారు.
గుడిపల్లి మండలంలోని పారిశ్రామిక ప్రారంభోత్సవాల కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాద్ మాట్లాడుతూ..
కుప్పంలో వేగంగా జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని కాంచీపురం, ఔరంగాబాద్ వంటి ప్రముఖ పారిశ్రామిక ప్రాంతాలను చూసినప్పుడు అలాంటి అభివృద్ధి కుప్పంలోనూ సాధ్యమవుతుందా అనే సందేహం ఉండేదని, అయితే నేడు కుప్పంలో ఏర్పడుతున్న ఆధునిక పారిశ్రామిక వాతావరణాన్ని ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఆ కల నిజమవుతోందని ఆనందం వ్యక్తం చేశారు. కుప్పంలో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతం పారిశ్రామికాభివృద్ధికి కేంద్రంగా రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు. దీంతో స్థానిక యువతకు, విద్యార్థులకు ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని అన్నారు.
విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, బాగా చదువుకుని తమ విద్య పూర్తయ్యే సమయానికి ఈ పరిశ్రమల్లోనే ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేలా సిద్ధంగా ఉండాలని సూచించారు. కుప్పం యువతకు బంగారు భవిష్యత్తు ముందుందని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి వేగంగా జరుగుతోందని, ఈ అభివృద్ధి కుప్పానికే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ఆకాంక్షించారు.
కుప్పం ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరాధ్య నాయకుడని పేర్కొన్న ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
గుడిపల్లి మండలంలో నిర్వహించిన పారిశ్రామిక యూనిట్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో గత రెండేళ్లలో కుప్పం నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరుగుతోందని తెలిపారు.గత రెండేళ్లలో కుప్పంలో మొత్తం 20 పరిశ్రమలు ఏర్పాటు దశకు చేరుకున్నాయని, అందులో ఇప్పటికే 8 పరిశ్రమలు ప్రారంభం కాగా, మరో 12 పరిశ్రమలకు నేడు శంకుస్థాపన జరుగుతోందని చెప్పారు. ఈ పరిశ్రమల ద్వారా సుమారు రూ.3,872 కోట్ల పెట్టుబడులు సమకూరనున్నాయని, ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా కలిపి 23,169 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు.ముఖ్యమంత్రి ప్రతి వారం, ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కుప్పం అభివృద్ధిపై సమీక్షలు నిర్వహిస్తూ, పారిశ్రామికాభివృద్ధితో పాటు తాగునీటి సరఫరా, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా సాగు మరియు తాగునీటి అవసరాల పరిష్కారం, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సేవల మెరుగుదల, ప్రజలతో అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించేలా నిరంతరం మార్గనిర్దేశం చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ సంస్థలైన అడిడాస్ మరియు ఆధార్ సంస్థలకు సంబంధించిన పారిశ్రామిక యూనిట్ల ప్రారంభోత్సవాలతో పాటు, ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్మితమైన ఆధ్యాత్మిక కేంద్రం మరియు వేదికను కూడా ప్రారంభించడం విశేషమని పేర్కొన్నారు.
కుప్పాన్ని పారిశ్రామిక, ఆర్థిక మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి విజన్‌ను సాకారం చేసేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో కృషి చేస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు అధికారులు సమిష్టిగా పనిచేస్తారని తెలిపారు.
ఏ.పి.ఐ.ఐ సి డైరెక్టర్ మాట్లాడుతూ ..
కుప్పం ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు స్వస్థలంలోనే ఉపాధి అవకాశాలు లభించేలా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యలు చారిత్రాత్మకమని ఏపీఐఐసీ డైరెక్టర్ పేర్కొన్నారు.శుక్రవారం గుడిపల్లి మండలం పొగురుపల్లి పారిశ్రామిక ప్రాంతంలో నిర్వహించిన పరిశ్రమల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కుప్పం ప్రజల అండదండలతో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకమని కొనియాడారు.గతంలో కుప్పం ప్రాంత ప్రజలు ఉపాధి కోసం బెంగళూరు సహా ఇతర ప్రాంతాలకు వెళ్లి కుటుంబాలకు దూరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారని గుర్తు చేశారు. ఇప్పుడు రూ.3,500 కోట్లకు పైగా విలువైన పారిశ్రామిక పెట్టుబడులు కుప్పానికి రావడంతో వేలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు స్థానికంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దీనివల్ల యువతతో పాటు బలహీన వర్గాల ఆర్థికాభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించడంలో ప్రభుత్వం విజయవంతమైందన్నారు. కుప్పాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని, రాష్ట్ర అభివృద్ధికి ఈ కార్యక్రమాలు మైలురాయిగా నిలుస్తాయని అన్నారు.కుప్పం ప్రజల తరఫున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, స్థానిక యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు.