chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 8:30 am Digital Edition : CHITTOORE EXPRESS

కుప్పంలో స్విమ్స్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం  905 మందికి వైద్య సేవలు

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 20:

 

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) ఆధ్వర్యంలో కుప్పం ఏరియా ఆసుపత్రిలో సోమవారం సూపర్ స్పెషాలిటీ మెగా వైద్య శిబిరం, పింక్ బస్ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 905 మందికి వైద్య సేవలు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో 740 మందికి సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు, 165 మందికి పింక్ బస్ ద్వారా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ శిబిరానికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, స్విమ్స్ సంచాలకులు, ఉపకులపతి డా. ఆర్.వి. కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు నిపుణుల వైద్యసేవలు అందించడం లక్ష్యంగా ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ శిబిరం ప్రజలకు ఎంతో ఉపయోగపడిందని పేర్కొన్నారు. సూపర్ స్పెషాలిటీ శిబిరంలో కార్డియాలజీ, సిటి సర్జరీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, జనరల్ సర్జరీ, సర్జికల్ అంకాలజీ, మెడికల్ అంకాలజీ, రేడియేషన్ అంకాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, రేడియాలజీ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు పాల్గొని రోగులకు చికిత్సలు అందించారు. ఇక పింక్ బస్ ద్వారా నిర్వహించిన క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరంలో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు నిర్వహించగా, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణకు పాప్ స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ పరీక్షలకు మహిళలు, పురుషులు విశేషంగా స్పందించి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పి.ఎస్. మునిరత్నం, టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, కుప్పం ఏరియా హాస్పిటల్ కమిటీ వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి త్రిలోక్, కడ అడ్వైజర్ రాజ్ కుమార్, పీకేఎం చైర్మన్ డాక్టర్ సురేష్, నాయకులు డాక్టర్ సుధీర్, స్విమ్స్ వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.