chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 9:20 pm Digital Edition : CHITTOORE EXPRESS

కుప్పంలో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్టాపేజ్‌కు గ్రీన్ సిగ్నల్ రైల్వే శాఖ నిర్ణయంతో ప్రయాణికులకు భారీ ఊరట

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 17:

చిత్తూరు జిల్లా కుప్పం ప్రజలకు శుభవార్త అందింది. కుప్పం రైల్వే స్టేషన్‌లో రెండు దూరప్రాంత ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుపుదలకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అధికారికంగా లేఖ రాసి నిర్ణయాన్ని తెలియజేశారు. రైల్వే శాఖ తెలిపిన వివరాల ప్రకారం, వాస్కోడగామా – వేలంకణి మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలుకు కుప్పం రైల్వే స్టేషన్‌లో స్టాపేజ్ ఇవ్వడానికి అనుమతి లభించింది. అలాగే దాదర్ సెంట్రల్ – పాండిచ్చేరి ఎక్స్‌ప్రెస్ రైలును కూడా ఇకపై కుప్పం స్టేషన్‌లో నిలిపేలా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను వ్యక్తిగతంగా కలిసి కుప్పం రైల్వే స్టేషన్‌లో దూరప్రాంత ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపేజ్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కుప్పం మీదుగా అనేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు వెళ్లినా నిలుపుదల లేకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఎం అప్పటికే రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ప్రజలు, ప్రయాణికులు, వ్యాపార వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన అనంతరం రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ రెండు రైళ్ల స్టాపేజ్ అమల్లోకి వస్తే కుప్పం ప్రాంత ప్రజలకు ముంబై, గోవా, తమిళనాడు ప్రాంతాలకు నేరుగా ప్రయాణ సౌకర్యం మరింత సులభం కానుంది. కుప్పం ప్రజల దీర్ఘకాల డిమాండ్ నెరవేరినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం ప్రాంత అభివృద్ధికి తోడ్పడటంతో పాటు ప్రయాణికుల రాకపోకలు పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.